
మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్‌పై ఉత్తర ప్రదేశ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు. అయితే తనకేమీ కాలేదని క్షేమంగానే ఉన్నానని అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
త్వరలో యూపీ శాసనసభ ఎన్నికలు జరుగబోతుండటంతో ఆయన మజ్లీస్ పార్టీ అభ్యర్ధుల తరపున మీరట్ జిల్లాలోని కితౌర్‌లో ఎన్నికల ప్రచారం చేసి కారులో ఢిల్లీ తిరిగి వెళుతుండగా దారిలో ఛాజర్సీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. టోల్ ప్లాజా వద్ద తమ కారు స్లో అయినప్పుడు హటాత్తుగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తుపాకీతో 3-4 రౌండ్లు కాల్పులు జరిపి ఆయుధాలు అక్కడే వదిలేసి పరారయ్యారని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. వారి కాల్పులలో రెండు తూటాలు కారు తలుపులలో దిగగా మరో రెండు తూటాలు టైర్లకు తగలడంతో టైర్లు పంక్చర్ అయ్యాయి. అసదుద్దీన్ ఓవైసీ మరో వాహనంలో ఢిల్లీకి చేరుకొన్నారు. యూపీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ఘటన జరగడంతో సహజంగానే దీనిపై రాజకీయాలు మొదలవుతాయి. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచి యూపీలో మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అలాగే ఈ ఎన్నికలలో పోటీ చేసిన సీట్లను గెలుచుకొని యూపీ, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని మజ్లీస్ తహతహలాడుతోంది. కనుక ఈ ఘటనపై బిజెపి, మజ్లీస్ పార్టీల మద్య పరస్పర ఆరోపణలు మొదలవుతాయి.