ఖైరతాబాద్‌లో 210 ఇళ్ళకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌ నడిబొడ్డున గల ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో ప్రభుత్వం నిర్మించిన 210 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు గురువారం మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభోత్సవం చేసి లబ్దిదారులకు అందజేశారు. ఒక్కో బ్లాక్ 9 అంతస్తులు చొప్పున 5 బ్లాకులలో ఈ ఇళ్ళు నిర్మించారు. ప్రైవేట్ వెంచర్స్‌కు ఏమాత్రం తీసిపోని విదంగా వీటిలో లిఫ్ట్ సౌకర్యంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఏడు దుకాణాలతో ఓ షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించారు. ఐదు బ్లాకుల మద్య గల ఖాళీ స్థలంలో పూల మొక్కలునాటి చిన్న పార్క్‌ కూడా ఏర్పాటుచేస్తున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ లబ్దిదారులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “బయట మార్కెట్‌లో రూ.50 లక్షలు ఖరీదు చేసే ఈ ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం మీకు పూర్తి ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 18,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఇళ్ళ నిర్మాణం కోసం రూ.9,714 కోట్లు ఖర్చు చేస్తోంది. కొల్లూరులో 15,640 ఇళ్ళను నిర్మించాము. మరో వారం పది రోజులలో సిఎం కేసీఆర్‌ స్వయంగా వాటిని లబ్దిదారులకు అందజేస్తారు. దేశంలో మరెక్కడా ఈవిదంగా పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడం లేదు. కానీ రాష్ట్రంలో పేద ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలనే మంచి ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం మీకు ఇళ్ళు నిర్మించి ఇస్తోంది కనుక వాటిని చక్కగా కాపాడుకొంటూ, వాటి నిర్వహణ బాధ్యతను మీరే తీసుకోవాలి,” అని అన్నారు.