ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల్లో చీలికలు

వేతన సవరణపై ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ నెల 7వ తేదీ నుంచి నిరవదిక సమ్మె పిలుపు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలలో చీలికలు తెచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించగా, ఏపీఎస్ ఆర్టీసీలోని  ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ తాము సమ్మెలో పాల్గొనబోమని ప్రకటించాయి. 

అసోసియేషన్ ప్రతినిధులు బుదవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డిని కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా ఓ లేఖ కూడా ఇచ్చారు. ఏపీ సిఎం జగన్‌మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వం (ప్రజా రవాణా శాఖ)లో విలీనం చేయడమే కాకుండా కరోనా కష్టకాలంలో తమకు నెలనెలా టంచనుగా జీతాలు కూడా ఇచ్చి ఆదుకొన్నారని, కనుక సమ్మెలో పాల్గొని అటువంటి వ్యక్తికి ద్రోహం చేయలేమని ఏపీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు ప్రత్తిపాటి కిరణ్ బుజ్జి అన్నారు. వేతన సవరణ సమస్యల గురించి ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకొంటామని అన్నారు. ఏపీ సిఎం జగన్‌మోహన్ రెడ్డిపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.