ఏపీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నేడు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 11వ వేతన సవరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో అన్ని జిల్లాల నుంచి లక్షలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడకు బయలుదేరుతున్నారు. దీంతో పోలీసులు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను గృహనిర్బందం చేశారు. అన్ని జిల్లాల సరిహద్దులలో చెక్ పోస్టుల వద్ద, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులను మోహరించి ఎక్కడికి అక్కడ అడ్డుకొంటున్నారు. 

‘ఛలో విజయవాడ’ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని కనుక దానిలో పాల్గొనేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామని విజయవాడ పోలీస్ కమీషనర్‌ హెచ్చరించారు. ఇవాళ్ళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరికీ అత్యవసరమైతే తప్ప సెలవులు మంజూరు చేయరాదని, ఒకవేళ చేసినట్లయితే చర్యలు తప్పవని జిల్లాల కలెక్టర్లు అధికారులను హెచ్చరించారు.  

అయినప్పట్టికీ లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోలీసులు కళ్ళు గప్పి విజయవాడకు చేరుకొంటున్నారు. కొందరు రైతు కూలీలుగా, బిచ్చగాళ్ళు, సన్యాసులు తదితర మారువేషాలలో విజయవాడకు చేరుకొంటున్నారు. ఉద్యోగులను, ఉపాధ్యాయులను వారి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేస్తుండటంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.