
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం జరిగిన ఉద్యోగుల బదిలీలలో కొందరికి తమ సొంత జిల్లాలు కాకుండా వేరే జిల్లాలకు బదిలీ చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఉద్యోగుల పరస్పర బదిలీలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఉద్యోగుల అంతర్ జిల్లా బదిలీలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఒకే శాఖలో, సమాన హోదా కలిగిన ఉద్యోగులు మాత్రమే దీనికి అర్హులని తెలిపారు. ఉదాహరణకు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా చేస్తున్న ఉద్యోగి తాను బదిలీ అవ్వాలని కోరుకొంటున్న వేరే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలోని ఇంగ్లీష్ ఉపాధ్యాయుడితో మాత్రమే పరస్పర అంగీకారంతో ఆ జిల్లాకు బదిలీ కావచ్చు. తెలుగు లేదా వేరే సబ్జెక్ట్ బోదించే ఉపాధ్యాయుడు లేదా మరొకరితో బదిలీకి అనుమతించబడదు.
అలాగే ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ లేదా జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులు సమాన హోదాలో ఉన్నవారితోనే బదిలీ కావచ్చు. అలాగే వారు ఏ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నారో వేరే జిల్లాలో అదే విభాగానికి మాత్రమే పరస్పర బదిలీ కావచ్చు తప్ప వేరే శాఖలు, విభాగాలకు బదిలీలకు అనుమతించబడరు. ఈ పరస్పర బదిలీలన్నీ రాష్ట్రపతి ఉత్తర్వులు-2018కి లోబడి జరగాల్సి ఉంటుందని సోమేష్ కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.