
సిఎం కేసీఆర్ నిన్న ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిన్న సాయంత్రం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, “దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు...వాటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ పార్టీ అధినేతలు ప్రధానమంత్రి అవ్వాలని కలలు కంటుంటారు. సిఎం కేసీఆర్ కూడా అలాగే కలలు కంటున్నారు. అదేమీ తప్పు కాదు. అయితే కేవలం 17 లోక్‌సభ స్థానాలతో ఆయన ఏవిదంగా ప్రధాని కాగలరు?
దేశంలో ప్రాంతీయ పార్టీల అధినేతలను కూడగట్టుకొని జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తామని సిఎం కేసీఆర్ చెపుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇలాగే చాలా హడావుడి చేశారు కానీ తరువాత ఏమయిందో అందరికీ తెలుసు. ఈసారి కూడా అదే జరుగుతుంది. కనీసం ఆయన తాను కలుస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతల చేత ‘కేసీఆర్ నాయకత్వాన్ని మేము అంగీకరిస్తామని చెప్పించగలరా?’
ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపి జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు కానీ అది సాధ్యం కాదు. అసలు టిఆర్ఎస్ పార్టీ యూపీ, బీహార్, రాజస్థాన్ లేదా గుజరాత్ లేదా మరో రాష్ట్రంలో పోటీ చేయగలదా?చేసి గెలవగలదా?దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే మాకు పోటీ ఇవ్వలేకపోతోంది. ఇక తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై కేవలం 17 సీట్లున్న టిఆర్ఎస్ ఏవిదంగా మాకు ప్రత్యామ్నాయం కాగలదు?
కేంద్రంలో మా ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని సిఎం కేసీఆర్ అంటున్నారు. కానీ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో టిఆర్ఎస్ ఓటమి, బిజెపి గెలుపు రెండూ ఖాయమే. అప్పుడు ఆయన మాట ఎవరు వింటారు?ఏవిదంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు?ఈ వాస్తవాలను గ్రహించకుండా సిఎం కేసీఆర్ పగటి కలలు కంటామంటే మాకు అభ్యంతరం దేనికి?
రాజ్యాంగ సవరణలు చేయడం తప్పన్నట్లుగా సిఎం కేసీఆర్ మాట్లాడారు. కానీ గత ఏడేళ్ళలో అనేకసార్లు మేము రాజ్యాంగ సవరణలు చేసినప్పుడు టిఆర్ఎస్ కూడా వాటికి అనుకూలంగా ఓటు వేసిన సంగతి ఆయనకు గుర్తులేదా? అయినా రాజ్యాంగ సవరణలు బిజెపి ఏకపక్షంగా చేయలేదు. పార్లమెంటు ఆమోదంతోనే చేయగలుగుతుంది. ఈ విషయం సిఎం కేసీఆర్‌కు కూడా తెలుసు. కేంద్రప్రభుత్వంపై సిఎం కేసీఆర్ చేసిన విమర్శలకు మా రాష్ట్ర నేతలు సరైన సమాధానం చెపుతారు,” అని అన్నారు.