సిఎం కేసీఆర్‌ డా.అంబేడ్కర్‌ను అవమానించారు

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి కేంద్రంపై చేసిన విమర్శలు, కొత్త రాజ్యాంగం కావాలంటూ చేసిన సూచనలపై బిజెపి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ, “డా.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం రాసుకోవాలని సిఎం కేసీఆర్‌ చెప్పడం డా.అంబేడ్కర్‌ను అవమానించడమే. కేసీఆర్‌కు దళితుల పట్ల గౌరవం లేదు. అందుకే ఏనాడూ డా.అంబేడ్కర్ జయంతి,వర్దంతికి హాజరవలేదు. ఇంతవరకు ఆయన 125 అడుగుల విగ్రహాన్ని కూడా పెట్టలేదు. రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ దళితుడు కనుకనే టిఆర్ఎస్‌ ఎంపీలు ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారు. సిఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై రాష్ట్రంలో దళిత సమాజం స్పందించాలని కోరుతున్నాను. తెలంగాణలో సొంత రాజ్యాంగం అమలుచేస్తున్న సిఎం కేసీఆర్‌ భారత రాజ్యాంగాన్ని తప్పు పట్టడం చాలా విడ్డూరంగా ఉంది. 

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. గతంలో కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సిఎం కేసీఆర్‌పై ఉన్న కేసులలో జైలుకి పోవడం ఖాయమనే భయంతోనే ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ఈవిదంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతులను కోటీశ్వరులను చేశానని, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని గొప్పగా చెప్పుకొన్నారు. మరైతే నేటికీ రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు?దేశంలో నదుల అనుసంధానం చేయడం లేదని తరచూ విమర్శించే సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కేంద్రం నిధులు ఇచ్చి సహకరిస్తానంటే ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు? ప్రాజెక్టులలో వచ్చే కమీషన్లు పోతాయనేనా? హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓడిపోయినప్పటి నుంచి సిఎం కేసీఆర్‌ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు. అందుకే ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు,” అని ఘాటుగా జవాబిచ్చారు.