భారత్‌కు కొత్త రాజ్యాంగం కావాలి : సిఎం కేసీఆర్‌

కేంద్ర బడ్జెట్‌పై సిఎం కేసీఆర్‌ స్పందిస్తూ మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి సుమారు రెండున్నర గంటల పాటు కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేశంలో గుణాత్మకమైన మార్పు తీసుకురావాల్సి ఉంది. అందుకోసం నా వంతు బాధ్యత నిర్వర్తించేందుకు సిద్దంగా ఉన్నాను. నాకు ప్రధానమంత్రిని అవుదామనే ఆలోచన లేదు. గాడి తప్పిన ఈ దేశాన్ని చక్కదిద్దాలని మాత్రమే నా ఆలోచన. దీనికోసం కాంగ్రెస్‌, బిజెపియేతర పార్టీలను కలుపుకొని ముందుకు వెళతాను. ఇప్పటికే చాలామందిని కలిశాను. వచ్చే సోమవారం ముంబై వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో సమావేశమయ్యి చర్చిస్తాను. త్వరలోనే మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో హైదరాబాద్‌లోసదస్సు ఏర్పాటు చేసి దేశాన్ని ఏవిదంగా ముందుకు తీసుకువెళ్ళాలనే దానిపై చర్చిస్తాను. 

ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం వలన దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగడం లేదు. కనుక దేశానికి కొత్త రాజ్యాంగం రచించుకోవలసి ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.      

కాంగ్రెస్‌, బిజెపిలు దేశానికి పట్టిన దరిద్రం. వాటిని బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఈ దేశానికి వాటి శని విరగడ అవదు. భారతదేశంలో వనరులకు కరువు లేదు. మేధాశక్తికి కరువు లేదు. అయినా దేశాన్ని పాలించిన, పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు..వాటి చేతకాని పరిపాలనతో దేశాన్ని అధోగతి పాలుచేస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళవుతున్నా ఇంకా కరెంటు ఇవ్వలేకపోవడంతో దేశంలో 65 శాతం జనాభా ఇంకా చీకటిలోనే మగ్గుతున్నారు. 

కాంగ్రెస్‌ కొంత తగలేస్తే బిజెపి మొత్తం తగలేస్తోందిప్పుడు. ఫెడరల్ స్పూర్తితో పాలన సాగించాల్సిన కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించివేసి అన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన నరేంద్రమోడీ, ఉన్న కంపెనీలను, ప్రభుత్వ రంగా సంస్థలను అయినకాడికి అమ్మేస్తున్నారు. ఎన్నికలొస్తే ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల దుస్తులు, టోపీలు పెట్టుకొని ఓటర్లను ఆకట్టుకోవాలనుకొంటారు తప్ప దేశాన్ని అభివృద్ధి చేసి ఓట్లు అడుగుదామనే ఆలోచన చేయరు. మత రాజకీయాలు, మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలొ కొనసాగాలనుకొంటున్నారు. కానీ త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో బిజెపి పతనం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా యూపీ ఎన్నికలతో బిజెపి పతనం ప్రారంభం అవుతుంది. ఒకవేళ మళ్ళీ గెలిచినా ఆ అహంకారంతో విర్రవీగుతూ బిజెపి పతనం అవుతుంది,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.