రైల్‌ నిలయం ఎదుట టిఆర్ఎస్‌ ధర్నా

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విభజన హామీలలో ఒకటి. కానీ తెలంగాణ ఏర్పడి ఏడున్నరేళ్ళు పూర్తయినా ఇంతవరకు కేంద్రప్రభుత్వం ఆ హామీ నెరవేర్చలేదు. ఇప్పటికే పలు అంశాలపై కేంద్రప్రభుత్వంతో యుద్ధం ప్రారంభించిన టిఆర్ఎస్‌ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీపై కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌ నేతృత్వంలో టిఆర్ఎస్‌ శ్రేణులు నిన్న సికింద్రాబాద్‌లో రైల్ నిలయం వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాకు కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి. వినోద్ కుమార్‌ నేతృత్వంలో టిఆర్ఎస్‌ నేతలు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ రాయ్‌ని కలిసి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “రైల్వేమంత్రి ఏ రాష్ట్రానికి చెందినవారైతే ఆ రాష్ట్రానికే ఎక్కువ రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లు కేటాయించుకొంటారు తప్ప దేశంలో మిగిలిన రాష్ట్రాలను పట్టించుకోరు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తూనే ఉంది. కనీసం విభజన హామీలను కూడా నెరవేర్చలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి, రాష్ట్ర వాటాగా నిధులు కేటాయించినా కేంద్రప్రభుత్వం ఇంతవరకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు. పైగా రాష్ట్ర బిజెపి నేతలు ఈ విషయంలో అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగితే బిజెపి నేతలను రాష్ట్రంలో తిరగనీయము. విభజన హామీలలో ప్రతీ ఒక్కటీ నెరవేర్చే వరకు మేము కేంద్రంతో పోరాడుతూనే ఉంటాము,” అని వినోద్ కుమార్‌ అన్నారు.