నేటి నుంచే... పెంపు...ప్రారంభం..వడ్డింపులు

నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, అపార్ట్‌మెంట్‌ మార్కెట్‌ వాల్యూ, దాంతో బాటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరుగనున్నాయి. నేటి నుంచే (నిన్న అర్దరాత్రి తరువాత) ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌ నాగోబా జాతర మొదలయింది. నేడే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2022-23 సంవత్సరాలకు సంబందించి ఆర్ధిక సర్వే (బడ్జెట్‌) ప్రవేశపెట్టనున్నారు.  

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 8-16వరకు రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వగా, కరోనా కేసులు పెరగడంతో జనవరి 31వరకు సెలవులు పొడిగించి నేటి నుంచి పునః ప్రారంభిస్తున్నారు. కానీ నేటికీ కరోనా కేసులు ఎక్కువగానే ఉంది. ఇంకా 15 ఏళ్ళ లోపు పిల్లలకు టీకాలు వేయలేదు. కనుక తల్లితండ్రులు తమ పిల్లలను స్కూళ్ళు, కాలేజీలకు పంపిస్తారా లేదో చూడాలి. 

రాష్ట్రంలో స్థిరాస్తుల మార్కెట్‌లో వాల్యూ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు నేటి నుంచి భారీగా పెరుగుతుండటంతో గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా రిజిస్ట్రేషన్లు సాగాయి. దీంతో సర్వర్ సమస్యలు, ధరణీ పోర్టల్‌ పదేపదే హ్యాంగ్ అయిపోతుండటం, ఇతర సాంకేతిక సమస్యలతో క్రయవిక్రయదారులు చాలా ఇబ్బంది పడ్డారు. 

మెస్రా వంశీయులు నిన్న అర్ధరాత్రి కేస్లాపూర్‌లో నాగోబా బాబాను గోదావరి పవిత్ర జలాలతో అభిషేకించి, ప్రత్యేక పూజలు చేయడంతో నాగోబా జాతర మొదలైంది. 

ఎప్పటిలాగే ఈసారి కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సామాన్య, మద్యతరగతి ప్రజలు, పరిశ్రమలు, వ్యాపారులు కేంద్ర బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. మరి నిర్మలమ్మ ఎవరెవరికి ఏమి వడ్డిస్తారో మరికొన్ని గంటలలో తెలుస్తుంది.