బడ్జెట్‌ సమావేశాలలో కూడా టిఆర్ఎస్‌, బిజెపిల మద్య యుద్ధం?

జనవరి 31వ తేదీన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పార్లమెంట్‌ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజున కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఆనవాయితీ ప్రకారం మొదటి విడత బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 11వరకు జరుగుతాయి. మళ్ళీ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8వరకు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలలో 2022-23 బడ్జెట్‌పై చర్చించి ఆమోదిస్తారు. 

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతున్నందున సిఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో టిఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి బడ్జెట్‌ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు, బకాయిలు, విభజన హామీల అమలు, రాష్ట్రానికి సంబందించిన వివిద పెండింగ్ సమస్యలపై పార్లమెంటులో ఏవిదంగా పోరాడాలో సిఎం కేసీఆర్‌ తమ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు మార్గదర్శనం చేస్తారు.

గత పార్లమెంటు సమావేశాలలో ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్‌ ఎంపీలు పార్లమెంటు లోపలా, బయట కూడా ఆందోళనలు చేసారు. అయినా ఫలితం లేకపోవడంతో సమావేశాలను బహిష్కరించి హైదరాబాద్‌ తిరిగివచ్చారు. అప్పటి నుంచి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య దూరం నానాటికీ పెరుగుతూనే ఉంది. అలాగే రాష్ట్రంలో టిఆర్ఎస్‌, బిజెపిలు కూడా నిత్యం కత్తులు దూసుకొంటూనే ఉన్నాయి. కనుక పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలో కూడా టిఆర్ఎస్‌ ఎంపీలు కేంద్రంపై కత్తులు దూయకమానరు. తెలంగాణ బిజెపి ఎంపీలు కూడా రాష్ట్రంలో తమపై జరుగుతున్న దాడులను ప్రస్తావించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే  అవకాశం ఉంది.