మాదకద్రవ్యాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం

సిఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ఇంకా పెరగక మునుపే దానిని ఉక్కుపాదంతో అణచివేయాలని, ప్రభుత్వం తరపున అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాలను రెండు వేర్వేరు సమస్యలుగా భావించి వాటి కట్టడికి తగిన ప్రణాళికలు, సిబ్బంది, వ్యవస్థలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలని కోరారు. 

పంజాబ్ మరియు స్కాట్‌లాండ్‌లో మాదకద్రవ్యాల నియంత్రణకు అక్కడ ఎటువంటి ప్రత్యేక వ్యవస్థలున్నాయో, వాటి అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకొనేందుకు అవసరమైతే అక్కడికి వెళ్ళి రావాలని, తగిన శిక్షణ పొందాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా గంజాయి సాగు చేస్తున్నా లేదా గంజాయి రవాణాకు సహకరిస్తున్నా ఆ గ్రామంలో అందరికీ రైతుబంధు పధకం నిలిపివేస్తామని సిఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఇక నుంచి రాష్ట్రంలో మాదకద్రవ్యాల కేసులలో పట్టుబడినవారిపై కటిన చర్యలు తీసుకోవాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని ఆదేశించారు. ఈ కేసులలో అధికార, ప్రతిపక్ష నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరు కలుగజేసుకొన్నా పట్టించుకోవద్దని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు.