ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన తెలంగాణకు చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగిలయ్యను సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో సన్మానించారు. అపురూపమైన 12 మెట్ల కిన్నెర వాద్య కళారూపాన్ని కాపాడుతున్నందుకు సిఎం కేసీఆర్ ఆయనను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనకు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ఇల్లు కట్టుకొనేందుకు కోటి రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక నుంచి గౌరవ వేతనం కూడా ఇస్తామని మొగిలయ్యకు సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మొగిలయ్య హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకొని స్థిరపడేందుకు ఆయనకు అన్నివిదాల సహకరించాలని సిఎం కేసీఆర్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. తన కళను గుర్తించి ఇంతగా ఆదరిస్తున్నందుకు మొగిలయ్య సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇంతవరకు కటిక దరిద్రం అనుభవిస్తూ దయనీయ జీవితం గడుపుతున్న దర్శనం మొగిలయ్య కష్టాలు ఇంతటితో తీరిపోతాయని ఆశిద్దాం.