రూ.1200 కోట్లతో కల్వకుర్తి-కర్నూల్ మద్య బైపాస్ రోడ్‌

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి కర్నూలు జిల్లాలోని నంద్యాల బైపాస్ రోడ్డు వరకు రూ.1,200 కోట్లు వ్యయంతో ఆరులేన్లతో కూడిన జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనికి సంబందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలుపుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-167కె) పొడవు 174కిమీ. తెలంగాణ పరిధిలో కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌ గుండా దీనిని నిర్మిస్తారు. ఏపీలో కర్నూలు జిల్లాలోని ఎర్రమఠం, మూసిలిమాద్, ఆత్మకూర్, వెలుగోడు, సంత జూటూరు, కరివేనపై ప్రాంతాల గుండా దీనిని నిర్మిస్తారు. ఈ జాతీయరహదారి నిర్మాణానికి రూ.600 కోట్లు కేటాయించింది.       

దీనిలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిలకు కర్నూలు జిల్లా సిద్ధేశ్వరంకు మద్య కృష్ణా నదిపై 2కిమీ వంతెన నిర్మిస్తారు. దీనికి రూ.600 కోట్లు కేటాయించింది.

ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల మద్య 80 కిమీ దూరం తగ్గడమే కాకుండా ప్రజారవాణా, సరుకు రవాణాలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో కర్నూలు జిల్లాలోని నంద్యాల నుంచి నాగర్‌కర్నూల్ మీదుగా నేరుగా హైదరాబాద్‌ చేరుకోవచ్చు. అలాగే తెలంగాణ నుంచి తిరుపతికి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. కర్నూలు జిల్లాలో వరద ముంపుకు గురయ్యే గ్రామాలకు కృష్ణా నదిపై నిర్మించబోయే ఈ వంతెనతో రోడ్డు ప్రయాణం సులువు అవుతుంది.