
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పధకంలో మళ్ళీ కదలిక వచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరీ, ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ 5 నియోజకవర్గాలలో మొదటి దశలో 500 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సంబందిత అధికారులు గురువారం ప్రారంభించారు. దీనిలో భాగంగా అధికారులు నిన్న స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశమై లబ్దిదారుల ఎంపికపై చర్చించారు. ఈ పధకం మొదటి దశ అమలుకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసింది. కనుక ఈ పధకం ద్వారా ప్రభుత్వం అందజేయబోయే రూ.9.90 లక్షలతో లబ్దిదారులు ఎటువంటి వ్యాపారాలు, వృత్తులు చేపట్టవచ్చనే వివరాలను కూడా తెలియజేశారు. ఫిబ్రవరి 5వ తేదీ లోపుగా అర్హులను గుర్తించి వారికి ఈ పధకం కింద సొమ్ము అందజేయబోతున్నారు. మంత్రి సిహెచ్ మల్లారెడ్డి కూడా నిన్న అధికారులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించి దళిత కుటుంబాలతో మాట్లాడారు.