నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ 2018 శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన రెండు అఫిడవిట్‌లలో ఒక దానిలో కొన్ని తప్పులు దొర్లడంతో, వాటిని సవరించేందుకు స్థానిక ఎన్నికల అధికారుల సాయంతో ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేశారని, దానిపై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు విచారణ జరుపుతోందని మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. 

వాటిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ స్పందిస్తూ బుదవారం టిఆర్ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. “మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి రాజకీయ దురుదేశ్యంతోనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఈసీ వెబ్‌సైట్‌ ట్యాంపరింగ్ చేయలేదు. అయినా ఢిల్లీ హైకోర్టు ఈ కేసును ఎప్పుడో కొట్టివేసింది. దానిపై రాద్ధాంతం చేయడం తగదు,” అని అన్నారు.  

అయితే ఈ పిటిషన్ వేసిన రాఘవేంద్రరాజు, ఆయన వాదనను ఖండించారు. తాను మొదట తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశానని అక్కడ ఆలస్యం అవుతుండటంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు తన పిటిషన్‌ను పరిశీలించిన తరువాత తెలంగాణ హైకోర్టుకే వెళ్ళమని సూచించడంతో అక్కడ పిటిషన్‌ ఉపసంహరించుకొన్నానని తెలిపారు. కనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ చెపుతున్నట్లుగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేయలేదని పిటిషనర్‌ రాఘవేంద్రరాజు అన్నారు.