హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు, గేటెడ్ కమ్యూనిటీలకు, కాలనీలకు త్రాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.587 కోట్లు వ్యయంతో ఫేజ్-2 ప్రారంభించింది. ఆ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు మణికొండలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేశంలో మరే నగరానికి లేని అనుకూలతలు హైదరాబాద్ నగరానికి మాత్రమే ఉన్నాయి. కనుక నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కనుక మరో 50 ఏళ్ళపాటు నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా ప్రాజెక్టులను (రోడ్లు, ఫ్లైఓవర్లు, తాగునీరు, విద్యుత్ మొదలైనవి) రూపొందించి అమలుచేస్తున్నాము. ఓఆర్ఆర్ ఏర్పడిన తరువాత చుట్టుపక్కల మున్సిపాలిటీలన్నీ హైదరాబాద్‌లో విలీనం అయిపోయాయి. కనుక వాటన్నిటికీ తాగు నీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్టులు చేపట్టింది. కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని తెచ్చి గండిపేట చెరువును నింపబోతున్నాము. ఈ రెండో ఫేజ్ ప్రాజెక్టు పనులు పూర్తయితే ఓఆర్ఆర్ పరిధిలోని పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, మేడ్చల్, ఇబ్రహీం పట్టణం, మహేశ్వరం తదితర ప్రాంతాలకు త్రాగునీటి సమస్యలు శాస్వితంగా పరిష్కారం అవుతాయి,” అని అన్నారు.