కేంద్రంపై మరో లేఖాస్త్రం సందించనున్న సిఎం కేసీఆర్‌

దేశంలో ఎరువుల ధరలు పెంచుతూ కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సిఎం కేసీఆర్‌ తప్పు పట్టారు. రైతులు ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోందని సిఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా తప్పించుకొంతున్న కేంద్రప్రభుత్వం మరోవైపు ఎరువుల ధరలు పెంచి వ్యవసాయ ఖర్చులను పెరిగేలా చేసి రైతులను వారి పొలాలలోనే కూలీలుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిఎం కేసీఆర్‌ అన్నారు.

దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు  మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇదని సిఎం కేసీఆర్‌ అన్నారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఇప్పటికే అనేక నిదర్శనాలున్నాయని ఎరువుల ధరలు పెంపుతో అది మరోసారి నిరూపించుకొందని అన్నారు. ఈ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పీకి పడేయాలని సిఎం కేసీఆర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రైతులు, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై ఎక్కడికక్కడ బిజెపి నేతలను నిలదీయాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.  

కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతానని సిఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఎరువుల ధరలను తక్షణం తగ్గించాలని కోరుతూ సిఎం కేసీఆర్‌ ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ లేఖ వ్రాయబోతున్నట్లు తెలిపారు.