బండి సంజయ్‌ ఏవైనా స్వాత్రంత్ర సమరయోధుడా? రేవంత్‌ ప్రశ్న

ఇటీవల అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళివచ్చిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను పరామర్శించేందుకు బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, అగ్రనేతలు తెలంగాణకు వస్తుండటంపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు సందించారు.

సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బండి సంజయ్‌ తన కార్యాలయంలో రాత్రిపూట జాగరణ చేస్తే టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి దేనికి అభ్యంతరం?బండి సంజయ్‌ జైలు నుంచి విడుదలై వస్తే ఇతర రాష్ట్రాల నుంచి రోజుకో బిజెపి నేత లేదా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి పరామర్శలు...సన్మానాలు...కౌగలింతలు దేనికో అర్ధం కాదు. బండి సంజయ్‌ ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా?లేక ఆయన యుద్ధవిమానం వేసుకొని వెళ్ళి పాకిస్తాన్‌ను ఓడించి వచ్చిన హీరోవా?తెలంగాణకు వస్తున్న బిజెపి అగ్రనేతలు కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ విమర్శలు గుప్పించి వెళ్ళిపోతుంటారు. అప్పుడు టిఆర్ఎస్‌ నేతలు మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బిజెపి నేతలే ఆరోపిస్తున్నప్పుడు కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ధాన్యం కొనుగోలు అంశంపై టిఆర్ఎస్‌ నేతలు ఇప్పుడు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు?బిజెపి, టిఆర్ఎస్‌ పార్టీలు పరస్పరం కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తూ ఆడుతున్న ఈ డ్రామాలు పరాకాష్టకు చేరాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసి బిజెపికి ప్రతిపక్షపార్టీగా నిలిపేందుకే టిఆర్ఎస్‌, బిజెపిలు ఈ డ్రామాలు ఆడుతున్నాయి. టిఆర్ఎస్‌, బిజెపిలు ఆడుతున్న ఈ డ్రామాలను ప్రజలు కూడా నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే,” అని అన్నారు.  

ఇవాళ్ళ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిజామాబాద్‌లో బండి సంజయ్‌ అధ్వర్యంలో జరిగే బిజెపి ర్యాలీలో పాల్గొబోతున్నారు.