
కేంద్రప్రభుత్వం, బిజెపిలపై యుద్ధ ప్రకటన చేసిన సిఎం కేసీఆర్, ఆ ప్రయత్నాలలో భాగంగా శనివారం ప్రగతి భవన్‌లో కమ్యూనిస్ట్, మార్కిస్ట్ పార్టీ అగ్ర నేతలు, ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.
హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు, సీపీఐ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. వాటిలో పాల్గొనేందుకు వచ్చిన వామపక్ష నేతలను సిఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు ఆహ్వానించి శనివారం సుమారు గంటసేపు వారితో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రంలో బిజెపిని గద్దె దించడం, అందుకోసం కాంగ్రెస్, బిజెపి రహితకూటమి ఏర్పాటు గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున భావస్వారూప్యత కలిగిన పార్టీలన్నీ చేతులు కలిపి కాంగ్రెస్, బిజెపిలను ఎదుర్కోవడానికి ఇదే తగిన సమయమని సిఎం కేసీఆర్ వామపక్ష నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి సిఎం కేసీఆర్ వారికి వివరించి, కేంద్రప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలపై అందరూ కలిసి బిజెపితో పోరాడటానికి కలిసి రావాలని కోరినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, సీపీఐ నుంచి డి.రాజా, ఎంపీ బినాయ్ విశ్వం, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ తరపున మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, ప్రశాంత్ రెడ్డి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.