ఏపీ ప్రభుత్వోద్యోగులు ఖుష్...23 శాతం ఫిట్‌మెంట్‌

ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి దానికి గల కారణాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ఏపీ సిఎం జగన్‌మోహన్‌ రెడ్డే స్వయంగా చెప్పారు. అయినప్పటికీ 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 10,247 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. 

ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపు, పదవీ విరమణ పెంపు రెండూ కూడా ఈనెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పెండింగ్ ఉన్న డీఏలను కూడా ఈనెల నుంచే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇంతేకాదు... సొంత ఇల్లులేని ఉద్యోగులందరికీ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అభివృద్ధి చేయబోతున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ లో 10 శాతం స్థలాలను రిజర్వ్ చేస్తామని వాటిని 20 శాతం రాయితీతో ఇస్తామని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీంతో ఏపీ ప్రభుత్వోద్యోగులకు ఈసారి సంక్రాంతి పండుగ నాలుగు రోజుల ముందే వచ్చేసినట్లు సంబురాలు జరుపుకొంటున్నారు.