
పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి తన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో తమను టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు కుమారుడు రాఘవ వేధించడం వలననే భార్యా పిల్లలతో కలిసి ఆత్మహత్యలు చేసుకొంటున్నామని చెప్పడంతో పోలీసులు వనమా రాఘవపై కేసు నమోదు చేసి నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ వేరే కేసులో ఈరోజు మధ్యాహ్నంలోగా లొంగిపోవాలని కోరుతూ పోలీసులు అతని ఇంటి గోడపై నోటీసు అంటించి వెళ్ళడంతో అతనిని అరెస్ట్ చేయలేదని స్పష్టం అయ్యింది.
నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో ఆరోపించినట్లే జిల్లాలో వనమా రాఘవ ఆగడాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయని తాజా నోటీసు దృవీకరిస్తోంది. వనమా రాఘవ వేధింపులు భరించలేక మనుగూరులో మలిపెద్ది వెంకటేశ్వర్లు అనే ఓ ఫైనాన్స్ వ్యాపారి కొంతకాలం క్రితం ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ కేసు విచారణకు ఏఎస్పీ శబరీష్ ఎదుట ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలలోగా హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కానీ మధ్యాహ్నం 2.15 గంటలైనా అతను హాజరుకాలేదు.
తన కొడుకును స్వయంగా తానే పోలీసులకు అప్పజెపుతానని, పోలీస్ విచారణకు సహకరించేలా చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు చెప్పారు. కానీ వనమా రాఘవ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం 8 పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. ప్రస్తుతం అతను రాజమండ్రీలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఓ బృందం అక్కడకు వెళ్ళినట్లు తెలుస్తోంది.
వనమా రాఘవ అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు కనుకనే పోలీసులు అతనిని అరెస్ట్ చేయడానికి వెనకాడుతున్నారని కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. వనమా రాఘవను తక్షణం అరెస్ట్ చేయాలని, వనమా వెంకటేశ్వర్లు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని లేకుంటే సిఎం కేసీఆర్ ఆయనను పార్టీ నుంచి, పదవి నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈరోజు కొత్తగూడెంలో బంద్ నిర్వహిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు వనమా ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తరపున ఎవరూ ఇంతవరకు స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.