వినాశకాలే విపరీత బుద్ధి..కేసీఆర్‌పై నడ్డా విమర్శలు

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుచేయడాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు. నిన్న హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ, అప్రజాస్వామిక, కేసీఆర్‌ కుటుంబ పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యపై బండి సంజయ్‌ ధర్మపోరాటం చేస్తే కరోనా పేరుతో ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేకనే బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయించారు. దీనిపై మేము రాజకీయంగా, న్యాయపరంగా, ప్రజాస్వామ్యబద్దంగా అన్ని వేదికలపై పోరాడుతాము. తెలంగాణ ప్రభుత్వం జీవో317ను ఉపసంహరించుకొనేవరకు మా పోరాటం కొనసాగుతుంది. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోవడంతో సిఎం కేసీఆర్‌ మానసిక సంతులనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్‌ను ఇందిరా పార్క్ వద్ద దీక్షకు అనుమతించని సిఎం కేసీఆర్‌ కొన్ని రోజుల క్రితం అక్కడే దీక్ష చేసిన సంగతి మరిచిపోయారా? రాష్ట్రంలో టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు దీక్షలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు కానీ ప్రతిపక్షాలకు వీలు లేదా? 

వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లు టిఆర్ఎస్‌కు రోజులు దగ్గర పడినందునే సిఎం కేసీఆర్‌ ఈవిదంగా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచి అవినీతికి పాల్పడ్డారు. ఆ ప్రాజెక్టును ఆయన ఏటీఎంలాగ వాడుకొంటున్నారు. మిషన్ భగీరధలో కూడా చాలా అవినీతి జరిగింది. త్వరలోనే ఆయన ముసుగు తొలగించి నిజరూపం బయట పెడతాము. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన అంతం చేసి తీరుతాము. ప్రజలు కూడా వారి కోసం పోరాడుతున్న బిజెపిని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను,” అని అన్నారు.