కేంద్రం వైఖరి చాలా నిరాశ కలిగించింది: నిరంజన్ రెడ్డి

తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం శుక్రవారం రాత్రి 9 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, ఎంపీలు నామా నాగేశ్వర రావు, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సుమారు గంటసేపు సాగిన సమావేశంలో కేంద్రం తరపున ఎటువంటి హామీ లభించకపోవడంతో వారు నిరాశతో వెనుతిరిగారు. 

అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రం వైఖరి పట్ల మేము తీవ్ర నిరాశ చెందాము. ఏడాదికి ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారనే అంశంపై కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు. ముందుగా అంచనావేసి చెప్పలేమని, సమగ్ర అధ్యయనం తరువాతే ఏమైనా చెప్పగలమని పీయూష్ గోయల్‌ చెప్పారు. అయితే వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ వేయద్దని ఖచ్చితంగా చెప్పారు. ఒకవైపు రాష్ట్రంలో మార్కెట్‌లో యార్డులకు ధాన్యం పోటెత్తుతోంది. ఇటువంటప్పుడు కేంద్రం వెనకడుగువేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకే ఈ సీజనులో పండిన ధాన్యంలో కనీసం కోటి టన్నులు తీసుకోవాలని కోరాము. కానీ 40 లక్షల టన్నులు మాత్రమే తీసుకొంటామని కేంద్రమంత్రి చెప్పారు. వీలైతే మరో 10 లక్షల టన్నులు తీసుకొంటామని చెప్పారు కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ప్రస్తుత పరిస్థితులలో ఇంతకు మించి ఏమీ చెప్పలేమని పీయూష్ గోయల్ చెప్పారు. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం చెపుతుంటే రాష్ట్ర బిజెపి నేతలు వరి వేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారని మేము కేంద్రమంత్రులు పీయూష్ గోయల్‌, నరేంద్ర తోమర్‌ తెలిపాము. కేంద్రం సానుకూల సమాధానం ఇస్తుందని మేము ఎంతో ఆశగా ఎదురుచూశాము కానీ చివరికి నిరాశే ఎదురైంది,” అని అన్నారు.