
హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ ఓటమి తరువాత సిఎం కేసీఆర్ తొలిసారిగా ప్రగతి భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం కొనుగోలు, పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గింపు, కేంద్రప్రభుత్వం, ద్వంద వైఖరి, రాష్ట్ర బిజెపి నేతల వ్యవహారశైలిపై చాలా ఘాటుగా స్పందించారు.
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని కోరుతూ బిజెపి నేతలు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా వ్యాట్ పెంచలేదు. కనుక తగ్గించే ప్రసక్తే లేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పన్ను రూపంలో లక్షల కోట్లు ఆర్జించింది. సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోసం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్ను పెంచితే దానిలో రాష్ట్రాలకు 41 శాతం వాటా చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది గనుక అది ఇవ్వకుండా తప్పించుకోవడానికి పన్నుకు బదులు వాటి ధరలు పెంచింది. ఇకనైనా రాష్ట్రాలను, ప్రజలను మోసం చేయడం మానుకోవాలి. పెట్రోల్, డీజిల్పై కేంద్రప్రభుత్వం సెస్సులు ఉపసంహరించుకోవాలి. ఇటీవల వివిద రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికలలో ప్రజలు బిజెపికి కర్రు కాల్చి వాత పెట్టినందున, త్వరలో నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలున్నందునే కేంద్రప్రభుత్వం ప్రజలను ఏదో ఉద్దరిస్తున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకం తగ్గించింది. ఈ సమస్యపై రాష్ట్రంలో బిజెపి నేతలు మాపై పోరాడటం కాదు...కేంద్రప్రభుత్వంవైఖరి మార్చుకోకపోతే మేమే దానిపై జాతీయస్థాయిలో పోరాటం మొదలుపెడతాము,” అని సిఎం కేసీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు.