
మాజీ మావోయిస్ట్ పి. పోచమల్లు యాదవ్ నిన్న హుజూరాబాద్‌లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎంపీ లక్ష్మీకాంతరావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “2002లో పోలీసులకు లొంగిపోయిన తరువాత 2004లో కృష్ణాష్టమి సందర్భంగా సుమారు 50 వేల మందితో ఘనంగా వేడుకలు నిర్వహించాను. అప్పటి నుంచి ఈటల రాజేందర్ నాపై కక్ష కట్టి అనేకవిధాలుగా వేధించారు. ఒకానొక సమయంలో నన్ను హత్య చేయించబోతే కెప్టెన్ లక్ష్మీకాంతరావు కాపాడారు. లేకుంటే ఆనాడే చనిపోయుండేవాడిని. నాకు పునర్జన్మ ఇచ్చిన ఆయనకు ఈ సందర్భంగా సభాముఖంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఆ సమయంలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉండటంతో ఆయనకు ఎవరూ ఎదురుచెప్పలేకపోయేవారు. గత ఎన్నికలలో ఈటల రాజేందర్ దామోదర్ రెడ్డిపై పోటీ చేసినప్పుడు నేను తలుచుకొంటే ఆయన గెలవకుండా అడ్డుకోగలిగేవాడిని కానీ ఉద్యమపార్టీ టిఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారనే కారణంగా నేను ఎన్నికలకు దూరంగా ఉండిపోయాను. హుజూరాబాద్‌లో టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకొనేందుకు నేను గట్టిగా ప్రయత్నిస్తాను,” అని అన్నారు.
ఇప్పటికే పేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములు కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌పై ఇప్పుడు పోచమల్లు యాదవ్ ఇంత తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిపై ఈటల రాజేందర్ ఏవిదంగా స్పందిస్తారో?