3.jpg)
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలీదు కానీ టిఆర్ఎస్, బిజెపిలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. తనను ఓడించేందుకే టిఆర్ఎస్ ప్రభుత్వం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తోందని, దళితబంధు, గొర్రెల పంపిణీ, పంటరుణాల మాఫీ తదితర హామీల అమలు చేస్తోందని, నియోజకవర్గంలో చిరకాలంగా పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు చేయిస్తోందని ఇవన్నీ తన రాజీనామాతోనే జరుగుతున్నాయని ఈటల రాజేందర్ వాదిస్తున్నారు.
అయితే టిఆర్ఎస్ వాదన ఇంకో రకంగా ఉంది. ఆదివారం సిద్ధిపేటలో టిఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, “ఈటల రాజేందర్ గెలిస్తే ఆయన ఒక్కడికే లాభం. నియోజకవర్గంలో అభివృద్ధిపనులు కుంటుపడితే ప్రజలు నష్టపోతారు. కనుక ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనం ముఖ్యమా లేక ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా? అని అందరూ ఆలోచించాలి. గతంలో హుజూరాబాద్‌లో రైతుబంధు కార్యక్రమం ప్రారంభిస్తే చప్పట్లు కొట్టి స్వాగతించిన ఈటల రాజేందర్, ఇప్పుడు హుజూరాబాద్‌లో దళిత బంధు పధకం అమలుచేస్తామంటే గుండెలు బాదుకొంటున్నారు. హుజూరాబాద్‌లో ఈ పధకాన్ని ప్రారంభించకుండా అడ్డుకోవడానికి తక్షణం ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌పై కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఈ పధకం నిలిచిపోతుందని ఆశ పడుతున్నారు. ఇదేనా దళితుల పట్ల ఆయనకుండే ప్రేమాభిమానాలు?ఈటల రాజేందర్ ఓటమి భయంతోనే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గడియారాలు, కుక్కర్లు, కుట్టు మిషన్లు పంచిపెడుతున్నారు. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీయే తప్పకుండా గెలుస్తుంది. ఎప్పటిలాగే ఈ ఉపఎన్నికలో కూడా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తూ గెలవాలని చూస్తున్నారు. వాటిని వాటిని టిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ బలంగా తిప్పి కొట్టాలి,” అని మంత్రి హరీష్‌రావు కోరారు.