
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుదవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని ఏడాది క్రితం ప్రారంభిస్తే సిఎం కేసీఆర్ ఇప్పుడు మేల్కొని హడావుడి చేస్తున్నారు. నిజానికి సిఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికీ ఈవిషయంలో చిత్తశుద్ది లేదు. సిఎం కేసీఆర్ పైకి తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతానని అంటారు కానీ ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే కుటుంబం, టిఆర్ఎస్ ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తుంటారు.
ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళను తరలించుకుపోతుంటే మేము గత ఏడాదే ఈ విషయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అడ్డుకోవాలని నొక్కి చెప్పాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టేసింది. ఇప్పుడు ఉపఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి లబ్ది పొందేందుకే టిఆర్ఎస్ ఇప్పుడు నీళ్ళ యుద్ధం అంటూ సరికొత్త డ్రామా మొదలుపెట్టింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకోవాలి లేకుంటే సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారు,” అని అన్నారు.