నేటి నుండి రైతుల ఖాతాలలో రైతు బంధు సొమ్ము జమా

తెలంగాణ ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టిన రైతుబంధు పధకం విజయవంతంగా సాగుతోంది. నేటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలలో రైతుబంధు సొమ్మును ప్రభుత్వం జమా చేయబోతోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.7,508 కోట్లు కేటాయించింది. గత ఏడాది రాష్ట్రంలో 61 లక్షల మంది రైతులు ఈ పధకంతో లబ్ది పొందగా, ఈసారి 63, 25,695 మంది లబ్ది పొందనున్నారు. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో కొత్తగా 66,311 ఎకరాలు సాగులోకి వచ్చింది. దీంతో  పంటలు పండించే రైతుల సంఖ్య కూడా పెరిగింది. వారిలో 2,81,865 మంది కొత్తగా ఈ పధకానికి ఎంపికయ్యారు. ఈసారి రైతుబంధు పధకంలో అత్యధికంగా నల్గొండ జిల్లాకు చెందిన రైతులు లబ్ది పొందనున్నారు. జిల్లాలో 4,72,983 మంది రైతులకు కలిపి మొత్తం రూ.6,081.81 కోట్లు అందుకోనున్నారు. 

ఈసారి ముందుగా ఎకరం పొలం ఉన్న రైతులకు రైతుబంధు నిధులు జమా చేయబడతాయి. బుదవారం రెండు ఏకరాలున్న రైతులకు, గురు, శుక్రవారాలలో మిగిలిన రైతులందరి ఖాతాలలోకి సొమ్ము జమా చేయబడుతుంది. 

2018 వానాకాలం నుంచి ప్రారంభించిన ఈ పధకంలో 2018-2019లో రెండు పంటలకు కలిపి మొత్తం రూ.10,488.19 కోట్లు, 2019-2020లో రెండు పంటలకు కలిపి రూ.10,532.02 కోట్లు, 2020-2021లో రెండు పంటలకు కలిపి రూ.14,656.01 కోట్లు, ఈ ఏడాది వానాకాలం పంటకు రూ. 7,508 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో 2018 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.43,184.22 కోట్లు రైతులకు చెల్లించింది.