సీజేఐ ఎన్వీ రమణకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం

తెలుగువారైన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. అక్కడ ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న తరువాత వారు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ చేరుకొన్నారు.   

వారికి శంషాబాద్ విమానాశ్రయంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌, మహమూద్ ఆలీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, డిజిపి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. 

అక్కడి నుంచి రాజ్‌భవన్‌ చేరుకొన్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సిఎం కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మూడు రోజులపాటు రాజ్‌భవన్‌ అతిధిగృహంలో బసచేస్తారు. 

జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే తెలంగాణ హైకోర్టులో ఉన్న 24 మంది న్యాయమూర్తులకు అదనంగా మరో 18 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.