పెట్రోల్, డీజీల ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ నిరసన

కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు శుక్రవారం పెట్రోల్ బంకుల ఎదుట బైటాయించి నిరసనలు తెలిపారు. హైదరాబాద్‌లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పలువురు సీనియర్ నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, తగ్గుతున్నప్పటికీ భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉనాయి. అటు కేంద్రప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా పెట్రోల్, డీజిల్‌పై భారీగా వసూలు చేసుకొంటూ సామాన్య ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచేసి సామాన్యులపై మరింత భారం మోపుతున్నాయి. ఈ కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం లేక సామాన్యప్రజలు విలవిలలాడుతుంటే చమురు కంపెనీలు తమ ఇష్టం వచ్చినట్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకొంటూపోతున్నాయి. అయినా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇకనైనా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఈ హడావుడిపై బిజెపి స్పందిస్తూ ముందుగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై పన్నులు తగ్గించి ఆ తరువాత మాట్లాడితే బాగుంటుందని ఆక్షేపించింది.