
కరోనా, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో ఆ లోటును భర్తీ చేసుకొనేందుకు ప్రభుత్వ భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి భూముల అమ్మకాలలో న్యాయవివాదాలు, అమ్మిన తరువాత వాటి కొనుగోలుదార్లకు ఎటువంటి సమస్యలు రాకుండా నివారించేందుకు ప్రభుత్వం నాలుగు కమిటీలను వేసింది.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి మళ్ళీ దాని కింద న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం ల్యాండ్స్ కమిటీ, అనుమతుల కోసం లాండ్స్ అప్రూవల్ కమిటీ, భూముల వేలం, అమ్మకాల కొరకు ఆక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది.
స్టీరింగ్ కమిటీలో ఆర్ధిక, రెవెన్యూ,మున్సిపల్, పరిశ్రమలు, హౌసింగ్, న్యాయశాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతీ రెండు వారాలకు ఓసారి సమావేశమయ్యి భూముల అమ్మకాలలో పురోగతిని సమీక్షిస్తుంటుంది.
ఈ కమిటీలలో జిల్లా కలెక్టర్లు కూడా ఉంటారు కనుక వారు చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తుంటారు. కలెక్టర్లు కనీసం 1,000 ఎకరాలను గుర్తించి అమ్మకం కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
ప్రభుత్వం అమ్మబోయే భూములను మల్టీ పర్పస్ జోన్ కిందకు తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం కరోనా సమస్య ఇంకా ఉన్నందున ఈ వేలంప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్‌లో ఈ-వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించింది.