తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు... సడలింపులు

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిన్న ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించిన తరువాత మరో 10 రోజులు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయించారు. ఈనెల 10 వ తేదీ నుంచి 19వరకు సాయంత్రం వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సత్తుపల్లి, మధిర, నల్గొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాలలో యధాప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్‌డౌన్‌ అమలుచేస్తారు. 

హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు సమయాన్ని పెంచాలానే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజలు ఇళ్ళు చేరుకొనేందుకు వీలుగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అనుమతిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి మార్నాడు ఉదయం 6 గంటల వరకు కటినంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలుచేస్తారు.

సాయంత్రం వరకు లాక్‌డౌన్‌ సడలించినందున గురువారం నుంచి అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.  

సడలింపులు: 

జాతీయ రహదారులపై ఉన్న పెట్రోల్ బంకులు 24 గంటలు తెరిచి ఉంచవచ్చు. మిగిలిన బంకులు మాత్రం సాయంత్రం 5 గంటల వరకే తెరిచి ఉంటాయి.   

రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బంది, అత్యవసర సేవలకు మినహాయింపు. 

ఆటోలు, క్యాబ్‌లు, మెట్రో, ఆర్టీసీ బస్సులతో సహా అన్ని రకాల ప్రజారవాణా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తాయి. 

నిషేధాలు: సినిమా హాల్స్, పార్కులు, పబ్బులు, క్లబ్బులు, జిమ్ సెంటర్స్, స్విమ్మింగ్ ఫూల్స్, అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులపై నిషేదం కొనసాగుతుంది. 

ఆంక్షలు: వివాహాలకు వధూవరుల రెండు కుటుంబాలు కలిపి మొత్తం 40 మందికి మాత్రమే అనుమతి. అంత్యక్రియలకు 20 మందికి అనుమతి.