
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణను టిఆర్ఎస్‌లో చేర్చుకొనేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈవిషయమై ఆయనతో మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్‌లో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్‌లో బలమైన బీసీ నాయకుడిగా పేరున్న ఈటల రాజేందర్ టిఆర్ఎస్‌ను వీడి వెళ్ళిపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టిఆర్ఎస్ అధిష్టానం ఎల్ రమణను ఎంచుకొంది. పార్టీ అధిష్టానం సూచన మేరకే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లు భావించవచ్చు.
ఇక ఎల్ రమణ విషయానికి వస్తే రాష్ట్రంలో టిడిపి దాదాపు కనుమరుగైపోవడంతో ఆయన చాలా కాలం క్రితమే పార్టీ మారాలనుకొన్నారు కానీ సరైన అవకాశం రాకపోవడంతో ఆయన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. టిఆర్ఎస్ నుంచి పిలుపుకోసం రాష్ట్రంలో అనేకమంది నేతలు ఎదురుచూస్తుంటారు. ఎల్ రమణకు ఇప్పుడు మంచి ఆఫర్‌తో ఆహ్వానం వచ్చింది కనుక టిఆర్ఎస్‌లో చేరడం ఖాయంగానే భావించవచ్చు. ఆయన టిడిపిని వీడితే ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది.
ఈటల రాజేందర్ వెళ్ళిపోయినా పార్టీకి ఎటువంటి నష్టమూ లేదని వాదిస్తున్న టిఆర్ఎస్ ఇంత హడావుడిగా బీసీ నేతగా గుర్తింపు పొందిన ఎల్ రమణను పార్టీలోకి తీసుకోవాలనుకోవడం గమనిస్తే ఈటల నిష్క్రమణతో లోటు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.