
తెలంగాణ కాంగ్రెస్ నేతలలో మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవిపై లొల్లి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో నేను చాలా సీనియర్ నేతని. ఎంతోకాలంగా పార్టీకి సేవ చేస్తున్నాను. ఈ పదవికి పోటీ పడుతున్న రేవంత్ రెడ్డితో సహా పార్టీలో అందరూ నాకు మద్దతు పలుకుతున్నారు. కనుక పిసిసి అధ్యక్ష పదవి నాకే లభిస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ వేరే ఎవరికైనా ఈ పదవి ఇచ్చినా నేను వారికి పూర్తిగా సహకరిస్తాను. పదవి లభించకపోయినా పార్టీలోనే కొనసాగుతాను. నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి వేరే పార్టీలో చేరాలనుకోవడం ఆయన వ్యక్తిగత విషయం. దాంతో నాకు ఎటువంటి సంబందామూ లేదు,” అని అన్నారు.
ఈ పదవికి పోటీ పడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీలో సీనియర్ నేతనైన తనకే ఈ పదవి ఇవ్వాలని గట్టిగా వాదిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ పదవికి సంబందించి కాంగ్రెస్ అధిష్టానం చర్చల్లో నా పేరు లేదని తెలిసి నేను చాలా బాధపడ్డాను. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మానిక్కం టాగూర్కు తెలంగాణ ఉద్యమాల గురించి, దానిలో నా పాత్ర గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి ఏమీ తెలీదు. నా గురించి ఏమీ తెలుసుకోకుండానే నాపేరును పక్కన పెట్టించేశారు. ఇది చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో సిఎం కేసీఆర్ను అడ్డుకోగల శక్తి నాకుంది. కేసీఆర్ను ఏవిదంగా గద్దె దించాలో కూడా నాకు తెలుసు. నాకు పిసిసి అధ్యక్ష లభిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురాగలను,” అని అన్నారు.
అయితే ఈ పదవికి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తునప్పటికీ ఆయన నోరు విప్పకపోవడం విశేషం. మరో వారం రోజులలోగా కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకం జరుగవచ్చని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనుక అంతవరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.