
తెలంగాణలో ఈనెల 9వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తుంది కనుక రేపు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపు సడలింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నందున సాయంత్రం 5 లేదా 6 గంటలవరకు లాక్‌డౌన్ సడలించి, రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం.
లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడటం, రిజిస్ట్రేషన్స్ స్థిరాస్తుల లావాదేవీలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయింది. రాష్ట్రంలో మెల్లగానైనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతున్నందున కరోనా వ్యాప్తి నెమ్మదించవచ్చు. కనుక మళ్ళీ అన్ని వ్యవస్థలు, సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేసుకొనేందుకు వీలుగా సాయంత్రం వరకు లాక్‌డౌన్ సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. లాక్‌డౌన్ పొడిగింపు, సడలింపులపై రేపు మంత్రివర్గ సమావేశం తరువాత స్పష్టత రావచ్చు.