ఈటల నాపేరు ప్రస్తావించడం నీచ రాజకీయమే: మంత్రి హరీష్‌

టిఆర్ఎస్‌లో మంత్రి హరీష్‌రావు కూడా తనలాగే అనేక అవమానాలు ఎదుర్కొన్నారంటూ ఈటల రాజేందర్‌ పదేపదే చెప్పడంపై హరీష్‌రావు చాలా ఘాటుగా స్పందించారు. మంత్రి హరీష్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దానిలో “ఈటల రాజేందర్‌ పార్టీని విడిచిపెట్టడానికి ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు కానీ మద్యలో నాపేరు ప్రస్తావిస్తూ తన సమస్యలకు నైతికబలం సమకూర్చుకోవాలనుకోవడం చాలా దారుణం. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన నా భుజం మీద తుపాకి పెట్టి మా అధినేతకు గురిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అది చాలా అవివేకం. నా గురించి ఆయన చెప్పిన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు. సిఎం కేసీఆర్‌ మా పార్టీ అధ్యక్షులు...మా నాయకుడు. ముఖ్యంగా నాకు గురువు, మార్గదర్శి, తండ్రివంటివారు. ఆయన గీసిన గీత ఎన్నడూ జవదాటను. ఎప్పటికీ నేను ఓ క్రమశిక్షణ కలిగిన ఓ కార్యకర్తలాగే నడుచుకొంటాను. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను. నాకు పార్టీ... అధిష్టానం కంటే ఏదీ ముఖ్యం కాదు. ఇదే విషయం గతంలో అనేకసార్లు చెప్పాను ఇప్పుడూ మళ్ళీ చెపుతున్నాను. కనుక ఇకనైనా ఈటల రాజేందర్‌ ఇటువంటి వికృత రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుంటుంది,” అని మంత్రి హరీష్‌రావు అన్నారు.   

ఈటల రాజేందర్‌ తనకు పార్టీలో అవమానాలు జరిగాయని చెప్పడంపై స్పందిస్తూ, “నిజానికి ఈటల రాజేందర్‌ పార్టీకి చేసిన సేవల కంటే, పార్టీ ఆయనకు ఇచ్చిందే చాలా ఎక్కువ. పార్టీలో...ప్రభుత్వంలో అందరి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకే లభించిన విషయం ఆయనకూ తెలుసు,” అని అన్నారు.