
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టెక్స్‌టైల్ పార్కు వద్ద రాజీవ్ రహదారికి సమీపంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీస్ కమీషనరేట్ కార్యాలయం రెండూ నిర్మాణపనులు పూర్తి చేసుకొని అన్ని హంగులతో ప్రారంభోత్సవానికి సిద్దం అయ్యాయి. పదిరోజులలోగా సిఎం కేసీఆర్ స్వయంగా వీటికి ప్రారంభోత్సవం చేయనున్నారు.
సమీకృత కలెక్టరేట్ కార్యాలయం: రూ. 54 కోట్లు వ్యయంతో సుమారు 50 ఎకరాల సువిశాలమైన స్థలంలో దీనిని నిర్మించారు. దీనిలో జిల్లా కలెక్టర్, డెప్యూటీ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలతో పాటు జిల్లాకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు దీనిలోనే ఉంటాయి. ఒక్కో అంతస్తు 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో జి+2గా నిర్మించారు. ఈ భవనంలో వివిద శాఖలకు చెందిన మొత్తం 46కు పైగా కార్యాలయాలు ఉంటాయి. దీనిలో వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం కలిగిన మూడు కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. ఈ భవనానికి సమీపంలోనే ఉన్నతాధికారులు, సిబ్బంది నివాస సముదాయాలను కూడా నిర్మించారు.
పోలీస్ కమీషనరేట్ కార్యాలయం: దీనిని రూ.15 కోట్లు వ్యయంతో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిలో పోలీస్ కమీషనర్, పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాలు, కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్, సిసి కెమెరాల మానిటరింగ్ రూమ్, శిక్షణా కార్యాలయంతో సహా పోలీస్ శాఖకు సంబందించిన పలు కార్యాలయాలన్నీ ఉంటాయి. ఒక్కో అంతస్తు 58,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో జి+2గా నిర్మించారు. ఈ భవనంకు సమీపంలోనే కమీషనర్‌తో సహా ఉనతాధికారుల నివాస సముదాయాన్ని కూడా నిర్మించారు. కమీషనరేట్ భవనం ఎదురుగా పెరేడ్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.