
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాత సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వాటిపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడి సాధించి, తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న సిఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వాటిని ప్రజలు కూడా హర్షించరు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంతో మంది నాయకులను తయారుచేశారు. వారిలో ఎంతోమంది టిఆర్ఎస్‌లో చేరారు. వారిలో ఈటల రాజేందర్ కూడా ఒకరు. అటువంటి కొందరు బయటకు వెళ్ళి నోటికివచ్చినట్లు మాట్లాడుతుంటారు.
ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే సిఎం కేసీఆర్ వెంటనే స్పందించి తన మంత్రిపై చర్యలు తీసుకొన్నారంటే అర్ధం నియంతృత్వమా లేక తన ప్రజల పట్ల..ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న గౌరవమా?సిఎం కేసీఆర్ ఆయనను ఎంతో గౌరవిస్తూ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం కల్పిస్తే ఇంకా ఏదో వెలితి చేసినట్లు అసంతృప్తితో మాట్లాడేవారు. అయినా సిఎం కేసీఆర్ ఏనాడూ ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించలేదు.
ప్రగతి భవన్ గేటు వద్ద వెనక్కు తిప్పి పంపి అవమానించారని ఈటల ఆరోపణ వాస్తవం కాదు. తనకు పదవుల కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని చెప్పుకొంటున్నప్పుడు గేటు దగ్గర ఆపినప్పుడే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండవచ్చు కదా?ఇన్నేళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు సిఎం కేసీఆర్ మీకు దేవుడిలా కనిపించేవారు. ఇప్పుడు పార్టీ వీడగానే అదే కేసీఆర్ ఇప్పుడు నియంతలాగా, దెయ్యంలాగా కనిపిస్తున్నారంటే ఏమనుకోవాలి?సిఎం కేసీఆర్‌ను విమర్శించడమంటే సూర్యుడిపై ఉమ్మి వేయాలనుకోవడమే. తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దే ఇటువంటి నేతలకు తెలంగాణ ప్రజలే బుద్ది చెపుతారు,” అని అన్నారు.