పార్టీకి పదవికి ఈటల రాజీనామా

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టిఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  శుక్రవారం ఉదయం 10 గంటలకు శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ, “ఎవరో అనామకుడు లేఖ వ్రాస్తే రాత్రికి రాత్రే నన్ను పదవిలో నుంచి తొలగించారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు కానీ నన్ను వివరణ అడగకుండానే పదవిలో నుంచి తొలగిచారు. నన్ను పార్టీలో నుంచి బయటకు వెళ్ళగొట్టాలని, అనర్హత వేటు వేయాలని మీరు (సిఎం కేసీఆర్‌) అనుకొంటున్నారు. కానీ నేనే నా పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ మంత్రి పదవి అడుక్కొంటే వచ్చింది కాదు...ప్రజల ఆధరాభిమానాలు, ఆశీర్వాదాలు ఉండబట్టే వచ్చిందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కనుక హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో మీ పార్టీ నేతలందరినీ డబ్బు సంచులతో దింపినా ప్రజలు నావైపే ఉంటారని గుర్తుంచుకోండి. నాతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇంకా జిల్లాకు చెందిన పలువురు నాయకులు టిఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నారు. ఇక నుంచి ఈ రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది,” అని అన్నారు. 

బానిస బతుకులు: 

ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి గురించి మాట్లాడుతూ, “ఎవరికీ మాట్లాడే స్వేచ్చ, స్వయంగా నిర్ణయాలు తీసుకొనే స్వాతంత్ర్యం లేనేలేదు. అందరూ బానిసల్లా బతుకుతున్నారు. సమైక్య రాష్ట్రంలో మేము నేరుగా కాంగ్రెస్‌ మంత్రులను కలిసి మాట్లాడి మా నియోజకవర్గాలలో పనులుచేయించుకోగలిగేవాళ్ళం కానీ ఇప్పుడు మాకే మిమ్మల్ని కలిసి మాట్లాడే అవకాశమే ఉండదు. గతంలో మేము గ్రామాలలోకి వెళితే అక్కడ ప్రజలు ఏవో వినతి పత్రాలు ఇచ్చినప్పుడు అక్కడికక్కడే జిల్లా అధికారులు, కలెక్టరుతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేవాళ్ళం కానీ ఇప్పుడు బియ్యం కార్డులు ఇవ్వాలన్నా మీ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వగలం తప్ప కార్డులు ఇప్పించుకోలేని దుస్థితిలో ఉన్నాము,” అని ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.