తెలంగాణలో వ్యవసాయ భూముల సర్వే

సిఎం కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలో రైతుల భూయాజమాన్య హక్కులను కాపాడేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేయించి వాటిని డిజిటల్ రికార్డ్ రూపంలో భద్రపరచాలని నిర్ణయించారు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 11 వ తేదీ నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో మూడు గ్రామాలు, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 24 జిల్లాలలో 24 గ్రామాలలో సర్వే చేస్తారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.400 కోట్లు నిధులు కేటాయించింది కూడా. 

సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ ప్రగతి భవన్‌లో డిజిటల్ సర్వే చేయబోయే సంస్థ ప్రతినిధులతో దీనిపై లోతుగా చర్చించారు. రాష్ట్రంలో రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడం, భవిష్యత్‌లో రైతుల మద్య ఎటువంటి భూతగాదాలు లేకుండా చేయడం కోసమే ఈ డిజిటల్ సర్వే చేయిస్తున్నామని కనుక సర్వేలో ప్రతీ అంగుళం భూమికి పక్కా లెక్క, కొలతలు ఉండాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. అప్పుడు ఆ వివరాలన్నిటినీ ధరణీ పోర్టల్‌లో ఎక్కిస్తామని చెప్పారు. ముందుగా ఎటువంటి భూవివాదాలు లేని గ్రామాలలో సర్వే నిర్వహించి ఆ తరువాత అటవీభూములు, ప్రభుత్వ భూములు ఉన్న గ్రామాలలో సర్వే చేసి అనుభవపూర్వకంగా సమస్యలను అర్ధం చేసుకొని తదనుగుణంగా విధివిధానాలు రూపొందించుకొని రాష్ట్రవ్యాప్తంగా సర్వేకు సిద్దమవ్వాలని సూచించారు. గ్రామాలలో వ్యవసాయ భూముల సర్వే సంతృప్తికరంగా ఉన్నట్లయితే తరువాత పట్టణాలలో సర్వే నిర్వహిద్దామని సిఎం కేసీఆర్‌ చెప్పారు.