
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం సాయంత్రం ఢిల్లీలో తెలంగాణ బిజెపి ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌తో, ఆ తరువాత బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, జివివేక్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ వారికి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, సిఎం కేసీఆర్ వైఖరి, తమపై రాజకీయ కక్ష సాధింపులు, టిఆర్ఎస్-బిజెపిల మద్య నెలకొన్న సంబంధాలు వంటి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. జేపీ నడ్డా ఆయనకు పూర్తి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కనుక ఈటల రాజేందర్ బిజెపిలో చేరడం దాదాపు ఖాయం అయినట్లే భావించవచ్చు. ఈటల రాజేందర్ హైదరాబాద్ చేరుకొన్న తరువాత తన అనుచరులు, ప్రొఫెసర్ కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో మరోమారు చర్చించిన తరువాత తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. బహుశః రెండు మూడు రోజులలోనే ఈటల బిజెపిలో చేరికపై స్పష్ఠత రావచ్చు.