
దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి మన వైద్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో కళ్ళకు కట్టినట్లు చూపడంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మేల్కొని భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కోవడానికి సన్నాహాలు మొదలుపెడుతున్నాయి. తెలంగాణలో కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలు, వాటికి అనుబందంగా ఏడు నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో 14 మెడికల్ కాలేజీలకు ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి నేడు వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నవాటితో కలుపుకొని ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 నియోజకవర్గాలలో 25 మెడికల్ కాలేజీలవుతాయి. ఈరోజు శంఖుస్థాపన చేయబోయే మెడికల్ కాలేజీలన్నిటినీ 2023లోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, పిడుగురాళ్ళ, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలలో ఇవి ఏర్పాటు కాబోతున్నాయి. వీటికి అనుబందంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.