హైకోర్టులో ఈటలకు ఎదురుదెబ్బ

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మెదక్‌ జిల్లాలోని మూసాయిపేటలో ఈటల భార్య జమునకు చెందిన భూములలో సర్వే నిర్వహించేందుకు అధికారులు నోటీస్ ఇవ్వగా ఆమె దానిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ఆమె పిటిషన్‌ను తిరస్కరించారు. ఆమెతో పాటు ఆ ప్రాంతంలో ఇంకా చాలా మందికి నోటీసులు ఇచ్చారని, కనుక చట్ట ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి సర్వే నిర్వహించడాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారులు ఇచ్చిన నోటీసులలో సాంకేతిక పరమైన కారణాలను సాకుగా చూపి భూములు సర్వే నిలిపివేయాలని కోరడం సరికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. జూన్‌ 2వ లేదా 3వ వారంలో ఈటల జమునకు చెందిన భూములలో సర్వే నిర్వహించవచ్చని ఎమ్మార్వోకు సూచించింది.   

ఆ ప్రాంతంలో చాలామంది అధీనంలో అసైన్డ్ భూములున్నట్లు గుర్తించినందున ఈ సర్వే నిర్వహించబోతున్నట్లు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఆవిదంగా నోటీసులు ఇచ్చినవారిలో కొంతమంది సమాధానం ఇచ్చారని తెలిపారు. కనుక ఈటల జమున కూడా కాలయాపన చేయకుండా నోటీసుకు సమాధానం ఇవ్వడం మంచిదని బిఎస్ ప్రసాద్ సూచించారు. 

ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయకూడదని తెలిసీ మంత్రి హోదాలో ఉండగా ఈటల రాజేందర్‌ కొన్నారు. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు కూడా. ఇప్పుడు ఆయన భార్యకు కూడా అసైన్డ్ భూములున్నట్లు సర్వేలో తేలితే ఆయన ప్రతిష్ట ఇంకా మంటగలుస్తుంది.