తెలంగాణలో వాక్సినేషన్‌కు కొత్త మార్గదర్శకాలు

మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమై రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేశారు. 

1. ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా టీకాలు వేయవచ్చు. విద్యాసంస్థలు, పరిశ్రమలు, గెటడ్ కమ్యూనిటీలు, కాలనీలలో కూడా ఏదైనా ఆసుపత్రి ద్వారా ఈవిదంగా రిజిస్ట్రేషన్, ఏర్పాట్లు చేసుకొని టీకాలు వేసుకోవచ్చు. అయితే ముందుగా కోవిన్ మొబైల్ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. 

2. ఈవిదంగా కొత్తగా నమోదు చేసుకొనే టీకా కేంద్రాలలో వాక్సిన్ నిలువ చేసే సదుపాయాలు, టీకాలు వేసేందుకు శిక్షణ పొందిన సిబ్బంది, టీకాలు వేసేందుకు తగినంత విశాలమైన గదులు, టీకాలు వేసుకొన్నవారిని అర్ధగంటసేపు పరిశీలనలో ఉంచడానికి గదులు, వారికి ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేసేందుకు అందుబాటులో వైద్యులు తదితర సౌకర్యాలు అన్నీ కలిగి ఉండాలి.  

ఆయా ఆసుపత్రులు లేదా టీకా కేంద్రాలు నేరుగా భారత్‌ బయోటెక్ కంపెనీ లేదా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాలతో మాట్లాడుకొని వాటికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం డబ్బు చెల్లించి వాక్సిన్లు తెప్పించుకోవచ్చు. టీకాలు వేసినందుకు ఒక్కో డోస్‌కు రూ.150 చొప్పున సర్వీసు ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. 

3. టీకాలు వేసుకొనేవారి పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి ఆన్‌లైన్‌లో టీకాలు వేసుకొన్నట్లు సర్టిఫికేట్లు ఇవ్వవలసి ఉంటుంది.

4. ఏయే టీకాలు ఎంత నిలువ ఉన్నాయి? సర్వీస్ చార్జీతో కలిపి వాటికి ఎంత చెల్లించవలసి ఉంటుంది?వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు కోవిన్ యాప్‌లో నమోదు చేస్తుండాలి.      

5. కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారికి మాత్రమే టీకాలు వేయాలి. ఒకవేళ టీకాలు వృధా అవుతున్నట్లయితే నేరుగా వచ్చినవారికి కూడా టీకాలు వేయవచ్చు.