తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్డౌన్ విధించినప్పటికీ అనేకమంది యధేచ్చగా వాహనాలు వేసుకొని రోడ్లపై తిరుగుతున్నారు. ఇది సిఎం కేసీఆర్ దృష్టికి రావడంతో మరింత కటినంగా లాక్డౌన్ ఆంక్షలు అమలుచేయాలని ఆదేశించారు. కనుక లాక్డౌన్ సమయంలో బయట తిరుగుతున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బందించి గట్టిగా హెచ్చరించి విడిచిపెడుతున్నారు. అయినా మార్పు కనబడకపోవడంతో నేటి నుంచి లాక్డౌన్ సమయంలో బయట తిరుగుతున్నవారి వాహనాలను స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీస్ శాఖ హెచ్చరించింది. లాక్డౌన్ ముగిసేవరకు ఆ వాహనాలన్నీ పోలీస్స్టేషన్లలోనే ఉంటాయని, ఆ తరువాత కోర్టుకు వెళ్ళి జరిమానాలు చెల్లించి వాటిని తిరిగి తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది. ఇదివరకు కూడా లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించినట్లు ఆ వాహనాలపై కేసులు నమోదైయుంటే ఈసారి పట్టుబడినప్పుడు మరింత భారీ జరిమానా, చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది. కనుక లాక్డౌన్ సమయంలో ఈ-పాసులు ఉన్నవారు తప్ప ఎవరూ బయటకు రావద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.