నేటి నుంచి రాష్ట్రంలో మళ్ళీ రెండో డోస్‌ టీకాల ప్రక్రియ షురూ

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మళ్ళీ రెండో డోస్‌ టీకాల ప్రక్రియ పునః ప్రారంభించాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం మొదటి డోస్‌ వేసుకొని 12 వారాలు పూర్తయినవారికి మాత్రమే నేటి నుంచి రెండో డోస్‌ టీకాలు వేస్తారు. మొదటి డోస్‌ కోసం ఎదురుచూస్తున్నవారికి ఎప్పటి నుంచి టీకాలు వేస్తారనేది వాక్సిన్ లభ్యత బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది. 

రాష్ట్ర అవసరాలకు సరిపడా వాక్సిన్ల సరఫరా కోసం సీరం, భారత్‌ బయోటెక్ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని, వీలైనంత త్వరగా గ్లోబల్ టెండర్లను ఖరారు చేసి విదేశాల నుంచి వాక్సిన్లు దిగుమతి చేసుకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కరోనా టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్, మంత్రి కేటీఆర్‌ను ఆదేశించారు.   

ఇక నుంచి ఎంతమంది వచ్చినా అందరికీ కరోనా పరీక్షలు చేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. కరోనా పరీక్షాలు నిర్వహిస్తున్న కేంద్రాలకు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు అవసరమైనన్ని టెస్టింగ్ కిట్స్ సరఫరా చేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకోసం 50 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లను సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకుగాను అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, అలాగే కరోనా చికిత్సకు అవసరమైన మందులు తెప్పించుకోవాలని ఆదేశించారు.  

లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కనుక లాక్‌డౌన్‌ కటినంగా అమలుచేయాలని సిఎం కేసీఆర్‌ డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించారు.