
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఆదివారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. మంగళవారంలోగా ప్రభుత్వం స్పందించకుంటే బుదవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె మొదలుపెడతామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసరి నవీన్, గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు మణికిరణ్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ సమస్యల గురించి గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని కానీ ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వడమే తప్ప పరిష్కరించడం లేదని, అందుకే మళ్ళీ ఈవిదంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నామని చెప్పారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో నిరవధిక సమ్మె చేయాలని తాము కోరుకోవడం లేదని కానీ ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె చేస్తామని తెలిపారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ తమ సమస్యల పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.