ఈటల కుటుంబంపై మరో భూకబ్జా ఫిర్యాదు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబంపై మరో భూకబ్జా ఆరోపణ వచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ మండలంలోని రావల్‌కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేష్ ముదిరాజ్ అనే రైతు నేరుగా సిఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. 

సర్వే నెంబర్ 77లో తమ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన సుమారు 10.11 ఎకరాల భూమిని ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్ రెడ్డి కబ్జా చేశాడని, గతంలో తాము ఈటలను కలిసి మొర పెట్టుకొన్నప్పటికీ ఆయన ఛీత్కరించుకొని పంపించేశారని చెప్పారు. 1954 నుంచి 84వరకు భూమికి  సంబందించి అన్ని రికార్డులలో తమ తాత, తండ్రి,తన పేర్లే ఉన్నాయని కానీ 1986లో కొత్తగా రామలింగరాజు అండ్ అదర్స్ పేర్లు వచ్చి చేరాయని చెప్పారు. అప్పటి నుంచి తమ భూమిని కాపాడుకోవడానికి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని కానీ ఎవరూ తమ మొర ఆలకించలేదని కనుక తమకు న్యాయం చేయాలని కోరుతూ పీట్ల మహేష్ ముదిరాజ్ సిఎం కేసీఆర్‌కు లేఖ వ్రాయగా ఆయన వెంటనే స్పందించిన విచారణకు ఆదేశించారు.