ఎంపీ రఘురామకు సుప్రీం బెయిల్‌ మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ సంచలనం సృష్టించగా, ఆ తరువాత సీఐడీ పోలీసుల విచారణ సమయంలో తనను చిత్రహింసలు పెట్టారంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం ఇంకా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను హైదరాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన రెండు పాదాలకు తీవ్ర గాయలైనట్లు ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సుప్రీంకోర్టులో నిన్న ఆయన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగినప్పుడు ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, రఘురామకృష్ణం రాజే స్వయంగా తనను తాను గాయపరుచుకొని కస్టడీలో చిత్రహింసలు పెట్టారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని కనుక బెయిల్‌ మంజూరు చేయకూడదని వాదించారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.